జననం మరణం వ్యత్యాసం

బ్రతికి ఉన్నపుడు నలుగురు నీ గురించి చెడు చెప్పుకుంటారని దిగులు
ఆఖరి ఘడియలో గుమ్మిగూడిన జనాన్ని ఒక్కసారి లెక్క పెట్టు
నిన్న నీతో మౌనముదాల్చినా నేడు కంటిచెమ్మతో పలకరింపులు
అందుకే చచ్చేదాక అయినా చావు పట్ల ఆలోచన కట్టి పెట్టు

ఎవరో ఏదో అన్నారని ఆ మాటని మనసు లోతుల్లో ఉంచి
ప్రతి క్షణం నీలోనే నీవు కుమిలిపోయావు నిన్నటి వరకు
ఈ విషయం నీకూ తెలుసు మానవ జన్మ రాదు మరలి
అందుకే చచ్చేదాకా అయినా చావు పట్ల ఆలోచన కట్టి పెట్టు

మనసును గాయపరిచారని నిందించేవు నిన్న నీవాళ్ళని
చూడు నీ చుట్టు చేరిన వారిలో పరాయివాళ్ళు ఎవరు లేరు
మిగిలేవు ఏదో రోజు కాటిలో కట్టెలా కాలి బూడిదయ్యీ
అందుకే చచ్చేదాకా అయినా చావు పట్ల ఆలోచన కట్టి పెట్టు

ఆప్యాయంగా రోజు పలకరిస్తుంటే ఉండకు విని విననట్టు
రేపటిరోజునా ఆ పలకరింపులు శాశ్వతంగా మూగబోవచ్చు
గుండెలకు హత్తుకుని ఏడ్చినా శ్వాసను విడిచి వెళ్ళే రోజు రావచ్చు
అందుకే చచ్చేదాకా అయినా చావు పట్ల ఆలోచన కట్టి పెట్టు

మనసుకి గాయమయితే శాంతియుతంగా పరిష్కరించుకొవచ్చు
దేహానికి గాయమయితే సపర్యలతో ఉపశమనం పొందవచ్చు
జన్మించే ప్రతి జీవి జీర్ణవస్థలో మరణ శయ్య కాదు కనికట్టు
అందుకే చచ్చేదాకా అయినా చావు పట్ల ఆలోచన కట్టి పెట్టు

నీవు బ్రతికున్నపుడు నిన్ను వెనకకు నెట్టాలని చూస్తారు కొందరు
నీవు పరమపదించినాక నీ పార్థివ దేహాన్ని అనుసరిస్తారు అందరు
విడువక ఆశను బ్రతకాలి ఆజన్మాంతం జీవితాన్ని విధి రాసినట్టు
అందుకే చచ్చేదాకా అయినా చావు పట్ల ఆలోచన కట్టి పెట్టు

Disclaimer: ఈ కవిత కేవలం కల్పితమే.. దీని ద్వార మానవ జన్మ విశిష్టతను తెలియజేయాలని నా అభిమతం.. మానవ జన్మ ఎలాగు కనుమరుగవక తప్పదు కనుక బ్రతికున్న నాళ్ళు కొందరితో అయినా మంచిగా మెలిగితే అటు పిమ్మట మనం భౌతికంగా లేకున్నా ఏ కొందరి మనసులో జ్ఞాపకాలుగా మిగిలుంటే జన్మ ధన్యమని చెప్పటానికి చేసిన అక్షర ప్రయత్నం.. దీని ద్వార ఎవరిని ప్రలోభ పెట్టే ఉద్దేశ్యం నాకు లేదని మనవి చేసుకుంటున్నాను.

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం