ఇదేమి విచిత్రమో ఏమో
ఈ మధ్య నేను రాతిరి పదకొండు గంటలకు నిద్ర కై ఉపక్రమిస్తుంటే
ఒక్కోసారి ఏవేవో ఆలోచనలతో ఆ రాత్రంత పోరాడుతు
ఉషస్సుకు మునుపే తెలవారు ఝామున రెండున్నర గంటలకే మెలకువ వచ్చేస్తోంది. బహుశ లోకమంతట విచ్చలవిడిగా విజృంభిస్తున్న కోరోనవైరస్ గూర్చి ఆలోచనలో.. లేక ఎపుడు వీలు చిక్కితే చల్లగ పుట్టింటికి జారుకుందామని చూసే సతి ఏకధాటిగా మూడు నెలలు మెట్టినింట ఉండవలసి వచ్చిందనే నెపంతో విసిరే పదజాలం మూలానో (అక్కడికేదో మా అత్తారింటిలో అన్ని ఉన్నాయనుకునేరు. ఆమెకి అసలుకి మెట్టినిల్లే స్వర్గ ధామం)
లేక ఈ గందరగోళ సమయంలో అతలాకుతలమౌతున్న వాణిజ్య వ్యాపారాలు వృత్తి తాలుకు ఒడిదుడుకుల వలనో. మరి ముఖ్యంగ ఇటువంటి సమయంలో కనిపెంచిన తలిదండ్రుల ఆరోగ్యం మరియు నా కన్న కూతురి ఆలన పాలన ఆరోగ్యం గురించిన దిగులో.. తెలియక సతమతమవుతున్న వేళ వారంలో మూడు రోజుల మినహ నిద్ర పట్టట్లేదేమో. చూపెడదామన్నా ఛాతి ఆస్పత్రులను మినహాయించి ఇతర ఆరోగ్య సేవల నిమిత్తం వైద్యులు ఉన్నారో లేదో అనే సందిగ్దత. ఉన్నా గాని సుస్తి చేసిన పలువురు తిరిగే ఆరోగ్యాలయం లో ఇపుడు తిరగాడితే లేనివారికి సైతం వ్యాధి అంటుకుంటుందేమోనన్న భయం. ఈ కోవిడ్ కాలం లో పరిస్థితులు ఇంత దైన్యంగా ఉంటాయని ఎవరూ ఊహించనే లేదు అనే మిమాంసతో అందరు బాగుండాలని.. త్వరలోనే ఈ మహమ్మారి సోకకుండ, ప్రబలకుండ యథావిధిగ మునుపటి ఆరోగ్యవంతమైన జీవనశైలి చేకూరేలా త్వరిత గతిన దీనికి విరుగుడు అంటే టీకా వస్తే అంత మంచిది.