ఉప్పెన : అలలతీరం లో రేగిన అలజడి : కడలి కెరటం ౪

వైజాగ్ బీచ్ కారిడార్ కర్టసీ: వికీపీడియా 
"ఇంతకీ ఇప్పుడు మౌనాన్నె ఆశ్రయించారన్నావు, మరి ఐదేళ్లే కదా.. పుష్కర కాలం సంగతేంటి"
"అక్కడికే వస్తున్నాను, అలా చూడండి ఇది లాసన్ బే బీచ్, ఎంత బావుందొ కదా.. అలా మేము ఒకరితో ఒకరం మాట్లాడుకోకపోయిన, నేను మాత్రం తనని ఆరాధిస్తూనే ఉన్నా. తను నేను మళ్ళి ఒకే కాలేజీ లో చేరాము, కాని వేరు వేరు బ్రాంచ్ లు"
"ఇకనేం ఐతే, కాలేజీ ఒకటే, బ్రాంచ్లు వేరు, కలుసుకోవడానికి కుదరలేదు వెర్రి చూపులు అంతే కదా "
"అబ్బ తెలిసినట్టు ఎం చెప్పారు.. అదేమ లేదు, నేను చెప్పేది ఆలకించండి, ఆ తరువాత ఆన్సర్ ఇద్దు గాని, అలా ఆ ఐదేళ్ళలో ఎప్పుడు తనని గమనిస్తూనే ఉన్న.. నాకు తెలీకుండానే, తను నన్ను గమనిస్తూనే ఉండేది"
"అది నీకెలా తెలుసు అనే సందేహం మాది"
"మా కాలేజీ లో ఇంటర్నల్స్ ఎప్పుడు వాళ్ళ క్లాసు లో వెళ్లి రాయాల్సిందే, అలా అన్నమాట నాకు తెలిసింది "
"ఇంతకీ అసలు విషయానికి రావోయి"
"అక్కడికే వస్తున్నా .. ఓపిక పట్టండి, ఇది ఎండాడ బీచ్, దిన్ని ఆనుకుని ముందుకెళితే అక్కడ భీమ్లి బీచ్ వస్తుంది... అలా థర్డ్ ఇయర్ లో ఒకరోజు నేను బజ్జిలవి తీసుకుందామని కాంటీన్ కానీ వెళితే, పక్కనే నించొని ఉంది తను.. భయం భయం గ బెరుకుగా నా ఆర్డర్ ఇచ్చా అక్కడి ఆంటీ కి "
"  బాబు నీ విషయం చెప్పరా నాయన అంటే తిండి గోల మొదలు పెట్టావా ..? ఇంతకీ అక్కడ బజ్జి తిన్నావా లేక తనుందని తెలిసి వెళ్ళవా?"
"ఆ కాంటీన్ మా క్లాసు పక్కనే ఉంటుంది, సో తానె అక్కడకు వచ్చింది, నాకు కోపం వస్తే నాకు కోపం తెప్పించిన వాళ్ళు మాట్లాడిస్తేనే మాటలు కలుపుతా, తనే ముందు నాతొ మాట్లాడింది 'హాయి' అంటూ"
"ఇంకేముంది కథ మళ్ళి మొదటికొచ్చింది.. ఈ సారి ఎలాటి చీవాట్లు లేకుండా"
"అదికాదు.. తనకు ఇన్నేళ్ళ తరవాత నాలోని నిజాయితీ నచ్చి మాట్లాడాలని అనిపించి పలకరించింది అంతే, లోలోపల ఏదో తెలియని పరవశం, బయిట మాత్రం వణుకు బెరుకు, ఈ సారి పర్యవసానాలు ఏమవుతుందో అని"
"భలే ఉంది బాసు, తానే వచ్చి మాట్లాడిన తరువాత కూడా బెదురెందుకు చెప్పు"
"నేను చెప్పిన సంద్రం అలా మళ్ళి ఒడ్డును వచ్చి తాకిందా లేదా?"
"నువ్వు చెప్పకపోయినా అలలు వెన్నక్కి ముందుకు కదులుతాయి తెలిసిందే కదా"
"నాయన.. నేను అనేది నా విషయం లో ఆ టైటిల్ విషయం లో నేను చెప్పిందే జరిగింది కదా అని అడుగుతున్నా"
"ఓ అదా !! అలాగే అయ్యింది లే.. మరి ఇప్పుడు చెప్పు ఆ బెరుకు బెదురెందుకు"
"వాళ్ళ అక్క కూడా ఆ కాలేజీ లో వేరే బ్రాంచ్ .. తను చూసిందా అంతే సంగతులు అని హడలి పోయా"
"ఇంత  జడుచుకునే వాడికి ఇవన్ని అవసరమా, ముందు మాకు టీయో కాఫీయో ఏర్పాటు చెయ్యి"
"ఇప్పుడు మనం ఎర్ర మట్టిదిబ్బల దగ్గరున్నాం, ఇక్కడవి దొరకడం కష్టం కాని, కాసేపాగాక చాపలుప్పాడ, కాపులుప్పాడ దాటి భీమునిపట్నం బీచ్ కు చేరుకుంటాం, కాస్త ఓపిక పట్టు"
"ఇక నా వల్ల  కాదు గాని, నువ్వు చెప్పు , నేనిక్కడ కుర్చుంటా, పిక్కలు పట్టేశాయి, అనట్టు ఏమైంది ఆ తరువాయి"
"ఏముంది అంత షరామామూలే, లంచ్ తరువాత టైం ఉంటె కంప్యూటర్ ల్యాబ్ లోనో లేకపోతె కారిడార్ లోనో సైగలవి చేసుకునే వాళ్ళం, అవసరం పడితే తప్ప మాటలు లేవు"
"ఇంకేమైతే  మరి కథ సుఖాంతం అయ్యింది కదా... ఇందులో ట్రాజెడీ ఎక్కడుంది..?"
"హ్మ్ నేనేం చెప్పను!! మొత్తం విని ఆ తరువాత మాట్లాడాలని చెప్పాన లేదా, ఆ తరువాత ఓ రోజు తను నాకు ఇ -మెయిల్ ఐడి పంపింది, అలా మా లేఖలు మొదలు, ఆ తరువాత బస్సు లో పక్కపక్కన కూచొని కబుర్లు అవి చెప్పుకున్నాం, మాకేం తెలుసు అదే మా చివరి పరిచయం అవుతుందని"
"ఏమైంది రా మళ్ళి , ఈ ట్విస్ట్ ఏంటి? ఐన వాళ్ళక్క కు తెలిస్తే ప్రాబ్లం అన్నావు కదా, బస్సు లో వాళ్ళక్క లేదా??"
"తన డిపార్టుమెంటు వేరు, సో మా బస్సు రాత్రి ఎనిమిదింటికి బయలుదేరేది, ఆ అమ్మాయి అప్పుడప్పుడు అందులో ఎక్కేది, అలా మా పరిచయం బలపడింది"
"మొత్తానికి ఓ కొలిక్కి వచ్చింది కదా, మరి ఎందుకు మళ్ళి విడిపోవాల్సి వచ్చింది?"
"ఏమి లేదు, మా కాలేజీ డేస్ ఐపోయి విడిపోవాల్సి వచ్చింది అది సంగతి, ఐన తనతో కాంటాక్ట్ లోనే ఉన్న, ఒక రోజు 'ఎప్పుడూ  మెసేజ్ లేనా, నాతొ మాట్లాడవా, నీతో మాట్లాడి చాల రోజులవుతుంది కదా' అని మెసేజ్ పంపితే, సరేనని కాల్ చేశా.. "
".. .. ఏంటి అలా అర్ధంతరంగా ఆపెశావ్ "

"... ఇప్పటి దాక చెప్పి ఇప్పుడిక్కడ ఇలా ఆపేస్తే మీరు నన్ను ఆ ప్రశ్న వేసారే, మరి నేను ఎవరిని అడగాలి?, ఆరోజు తనకి కాల్ చేస్తే వాళ్ళ అమ్మ ఎత్తారు, పై ప్రాణాలు పైనే పోయాయి, తడారిపోయింది నోరు, కట్ చేస్తే సాయంత్రానికో మెసేజ్ 'నేను మన విషయం ఇంట్లో చెప్పేసాను, వాళ్ళు ససేమిరా అన్నారు' అని ఉంది, అప్పటికి పన్నెండవ  సంవత్సరం నా/మా  ప్రేమ మొదలై , ఆ తరువాతి సంవత్సరం వాళ్ళ నాన్న రిటైర్ అయ్యి వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు, మళ్ళి  అలా సంద్రం సుడులలో ఏకమైపోయింది"

"ఏమో అనుకున్నాం గాని , నిజంగా చాల ఆసక్తికరంగా సాగిందిరా, ఇప్పుడు ఆ ఆలోచనల్లోనే ఉన్నావా?"
"అబ్బే ఇంకా లేదులెండి, తనకీపాటికి పెళ్లి అయిపోయుంటది, ఇక తనని తనవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని, వాళ్ళని గౌరవించి నేనిలా ఈ సంద్రం జ్ఞాపకాలతో, ఇలా ఉండిపోయానంతే"

"ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే అన్న చందాన అయ్యిందన్నమాట, ఏదేమైనా చాల మంచి కథ చెప్పావు, అలానే అడగడం మరిచా.. మనం ఇప్పుడు మాటల్లోపడి ఎంత దూరం నడిచివచ్చామో తెలుసా?"

"తెలుసు .. మనం మొదలుపెట్టిన బీచ్ యారాడ నుండి జోడుగుల్లపాలెం, దుర్గాపాలెం, ఫిషింగ్ హార్బర్, కోస్టల్ బాటరీ , రామకృష్ణ బీచ్, వుడా బీచ్, తెన్నెట్టి బీచ్, లుంబిని పార్క్, అప్పుఘర్, కైలాసగిరి, కంబాలకొండ, రుషికొండ బీచ్, కాపులుప్పాడ, చేపలుప్పాడ మీదుగా భీమ్లి బీచ్ మొత్తం చుట్టూ కొలత సుమారుగా 70 కి మీ. సంద్రం ఒడ్డున నడిచాం, మొత్తం వారం రోజులు ఉన్నాం"
"ఏదేమైనా నువ్వు చెప్పినట్టే పుష్కర కాలం నిజంగా ప్రేమించగలగడం చాల అరుదు, అలాగే  సంద్రం ఒడ్డున దాన్ని అంతరంగమెంటో  విపులంగా వివరించినందుకు,  తెలియకుండానే నీ కథలో లీనమై పోయినందుకు మనసు తేలికపడింది రా అబ్బాయి "

సుఖాంతం

"ఉప్పెన : అలలతీరం లో రేగిన అలజడి : కడలి కెరటం"

ఇంతటితో ఈ  పిచపాటి కథమాలిక సుఖాంతమయ్యింది

ఎంతో ఓపికతో నా ఈ కథ మాలిక ను తిలకించిన మీ అందరికి కృతఙ్ఞతలు తెలుపుకుంటూ, మరిన్ని ఇలాటి రచనలు చెయ్యడానికి కృషి చేస్తానని మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను.  ఈ కథ మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ,ఇందులోని పాత్రలు, ఈ బ్లాగ్ ఓనర్ ఐన నాకు ఎలాటి సంబంధం లేదని తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

నేను వివరించిన వైజాగ్ బీచ్ కారిడార్ ఇదే:
యారాడ బీచ్ నుండి రుషికొండ బీచ్ వరకు 

రుషికొండ నుండి భీమునిపట్నం బీచ్ వరకు 

Popular Posts